ఖమ్మం సీటు కచ్చితంగా గెలవాల్సిందే : కేటీఆర్
తెలంగాణ గళం, బలం బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్లో వేసే ప్రతి అడుగు కేసీఆర్ దళంగా, ఐకమత్యంగా ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుందామన్నారు. మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమే. అసెంబ్లీ సమావేశాల్లో మా పోరాట పటిమ చూశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సీఎం అనే రెండు అక్షరాల కన్నా, కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్పుల్. ఫిబ్రవరిలో ఆయన ప్రజల మధ్యకు వస్తారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ వారీగా సమీక్షలు ఉంటాయి. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తాం. ఖమ్మం సీటు కచ్చితంగా గెలవాల్సిందే అని స్పష్టం చేశారు.













