కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై రేవంత్ సర్కార్ పచ్చి అబద్దాలాడుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తమ ప్రభుత్వం ఇచ్చిందంటూ రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని, పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించిన కేటీఆర్.. మోసం చేస్తున్న పార్టీలకు కాకుండా వెన్నంటే ఉండి ఆదుకున్న పార్టీకి ఓటేయాలని ఉద్యోగులు, పట్టభద్రులను కోరారు.
‘‘ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్.. ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వకుండానే 30వేల ఉద్యోగాలిచ్చానంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నోటిఫికేషన్, పరీక్ష, ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత నియామక పత్రం ఇవ్వాలి. మరి రేవంత్ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు..? ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే ఉద్యోగాలెలా ఇచ్చారు? ఇదెలా ఉందంటే పెళ్లి కాలేదట కానీ, సంసారం అయిపోయి పిల్లలు మాత్రం పుట్టారట. ఎలా పుట్టారంటే మాత్రం సమాధానం లేదు. నిరుద్యోగులను పిచ్చివాళ్లను చేయడానికి చేస్తున్న మోసం ఇది. ఈ మోసాన్ని అర్థం చేసుకుని ఓటేయండి’’ అంటూ విద్యావంతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.