KTR: వారిని బీఆర్ఎస్ లోకి తీసుకునే ప్రసక్తే లేదు : కేటీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మారిన వాళ్లది ఎటు కాని బతుకైందంటూ వ్యాఖ్యలు చేశారు. పుట్టింటి వాళ్లు తరిమేశారు, కట్టు కున్నోడు వదిలేశాడు అన్నట్లుగా ఉంది వారి పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. పార్టీ మారినమని కూడా చెప్పుకోలేని బతుకు వాళ్లది అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas) వంటి నేతలు బాజాప్తా పార్టీ మారినట్లు చెప్పారని గుర్తుచేశారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి క్యారెక్టర్ లేదన్నారు. సైది రెడ్డి కనీసం సర్పంచ్లను గెలిపించుకోలేకపోయారన్నారు. వ్యక్తులు పార్టీ మారితే తమకు వచ్చే నష్టం ఏమి లేదని స్పష్టం చేశారు. మొన్నటి పంచాయతీ ఎన్నికలే అందుకు ఉదాహరణ అని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే తమకు మంచి మెజారిటీ వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.






