ఘనంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాడికితో దేవాలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలను సమర్పించారు. కేసీఆర్ దంపతులకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రభుత్వం సమర్పించిన 3 కేజీల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అమ్మవారికి బంగారు ముక్కుపుడక, ఖడ్డం, వజ్రాల బొట్టును మంత్రి తలసాని సమర్పించారు. అంతకుముందు తెల్లవారు జామున 4:05 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి తొలిబోనాన్ని సమర్పించారు.
ఉదయం 9:30 గంటలకు మోండామార్కెట్ ఆదయ్య నగర్ వద్ద ఏర్పాటు చసిన కార్యక్రమంలో ప్రభుత్వం తరపున తయారు చేయించిన బంగారు బోనానికి రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎంపీ కవితకు అప్పగించారు. బోనాలు ఎత్తుకున్న 1008 మంది మహిళలతో కలసి ఆమె బంగారు బోనాన్ని ఎత్తుకుని మహాంకాళి దేవాలయం వరకు ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి పూజలు జరిపి బోనాన్ని సమర్పించారు. రంగం కార్యక్రమం నేడు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.













