ఇద్దరు చంద్రులు కలిశారు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడులు కలిశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు మనవరాలి వివాహ విందులో ఇరువురు ముఖ్యమంత్రులు కరచాలనం చేసుకోవడంతో పాటు రామోజీరావు సమక్షంలోనే పది నిమిషాల పాటు వారిద్దరు మాట్లాడుకున్నారు. వివాహ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా ముందే చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కల్యాణవేదిక కింద కూర్చున్న రామోజీరావును చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుకుంటున్న సమయంలో కేసీఆర్ ఆయన సతీమణీ శోభ వధూవరులను ఆశీర్వదించాక కేసీఆర్ రామోజీరావు దగ్గరకు వచ్చిన ఆయనను పలకరించారు. అక్కడే ఉన్న చంద్రబాబును చూసిన కేసీఆర్ అభివాదం చేశారు. రామోజీరావు కుడి చేతివైపు కేసీఆర్, ఎడమ చేతివైపు చంద్రబాబు నిలబడ్డారు. చంద్రబాబు, కేసీఆర్లు ఒకరినొకరు పది నిముషాల పాటు మాట్లాడుకోవడంతో పాటు ఏదో ఒక విషయంలో సుదర్ఘీంగా చర్చించుకోవడం కనిపించింది.













