Kavitha: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మద్దతు దారుణం: కవిత
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేదని, పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీర్పు దారుణంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా కొత్తగూడెం, ఇల్లెందులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) పార్టీ మారి కాంగ్రెస్ (Congress) లో చేరిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. తాను బీఆర్ఎస్ ను వదిలాక ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. కానీ శాసనమండలి చైర్మనే ఇప్పటివరకు తన రాజీనామా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎవరైనా పార్టీలు మారితే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని, పార్టీల చిహ్నాలు లేకుండా జరిగిన ఎన్నికల్లో బలాబలాలు ఎలా తేలుతాయని ప్రశ్నించారు. కొత్తగూడెంలో ఖచ్చితంగా జాగృతి జెండాను ఎగురవేస్తామన్నారు.






