జూడాలతో విఫలమైన చర్చలు.. సమ్మె యథాతథం

జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డితో జూడాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ లభించలేదని, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడాలు ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ ఇస్తేనే విధుల్లో చేరుతామని జూడాలు తేల్చి చెప్పారు. కోవిడ్‌తో చనిపోయిన వారికి ప్రభుత్వం ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం కదురదని అంటున్నాని, కోవిడ్ సోకిన వైద్య సిబ్బందికి నిమ్స్‌లో బెడ్లు ఇచ్చే అంశం తమ పరిశీలనలో లేదని ప్రభుత్వం అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 శాతం కోవిడ్ ఇన్సెట్సివ్స్ కూడా ఇవ్వడం కుదరదని, ఈ ఏడాది జనవరి 1 నుంచి లేదా ఈ నెల నుంచి 15 శాతం పే హైక్‌ని ఇస్తామని ప్రభుత్వం తెలిపిందని జూడాలు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని, అందుకే విధుల్లో చేరే అంశంపై చర్చించుకుంటున్నామని తెలిపారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి రాత పూర్వక హామీ వస్తేనే తాము విధుల్లో చేరుతామని, అప్పటి వరకూ సమ్మెలోనే ఉంటామని జూడాలు ప్రకటించారు.