సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. డిమాండ్లన్నీ నెరవేర్చకున్నా… సీఎం హామీతో సమ్మె విరమిస్తున్నామని పేర్కొన్నారు. పెంచిన స్టైఫండ్, ప్రోత్సహకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… బుధవారం నుంచి జూడాలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. జూడాలతో ఆరోగ్య శాఖ కార్యదర్శి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. 15 శాతం స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సర్కార్ ఆమోదం కూడా తెలిపింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలోనే సీనియర్ రెసిడెంట్లకు 70,000 నుంచి 80,000 వరకు వేతనాలు పెరగనున్నాయి. నిమ్స్ బెడ్స్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, జీవో విడుదలకు మూడు రోజుల సమయం పడుతుందని సర్కార్ తెలిపిందని జూడాలు పేర్కొన్నారు. పరిహారం విషయంలో కొంత సాంకేతికత అడ్డువస్తోందని, ఇప్పటికే కేంద్రం ఎక్స్గ్రేషియా వస్తుందని, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలంటే ఎలా అని తమను ప్రభుత్వ ప్రతినిధులు అడిగారని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించాలన్నది తమ అభిమతం కాదని, అందుకే ఎమర్జెన్సీ విధులను బహిష్కరించలేదని జూడాల ప్రతినిధులు వివరించారు.













