సాగర్ లో గెలుపుకు కాంగ్రెస్ కసరత్తు
త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మాజీ మంత్రి కె. జానారెడ్డిని నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి జానారెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. సాగర్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా కె. జానారెడ్డిని నిర్ణయించామనీ, ఆ ఉపఎన్నికల తర్వాతనే టీపీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుంనీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు మాణిక్కం టారూర్ ప్రకటించారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ నాయకులందరూ కలసికట్టుగా పని చేస్తే జానారెడ్డి విజయం ఖాయమని చెబుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డికి తిరుగులేని పట్టు ఉంది.
రైతులకు మద్దతుగా హైదరాబాద్లో జరిగిన రైతు దీక్షలో జానారెడ్డి పాల్గొని రైతులకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు తమ మద్దతు ఉంటుందని, రైతుల పక్షాన ఎలుగెత్తుతున్న రైతు సంఘాలకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు. జానా ప్రసంగం ముగించిన తర్వాత వేదికపై ఉన్న వీహెచ్ మైక్ అందుకుని, మిత్రుడు జానారెడ్డికి ముందేం జరిగిందో తెలియదు అంటూ మొదలుపెట్టారు. పేదవాళ్లు కూడా ఢిల్లీలోని రైతులకు విరాళాలు ఇస్తున్నారని, జానారెడ్డి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో జానారెడ్డి తన జేబులో ఎంత ఉంటే అంత ఇస్తానని, అవసరమైతే తర్వాత కూడా ఇస్తానని చెప్పారు. చెప్పడమే కాదు, జేబులోంచి కరెన్సీ నోట్లు తీసి వీహెచ్ కు ఇచ్చారు. వీహెచ్ ఆ నోట్లను లెక్కించి జానారెడ్డి కచ్చితంగా 10 వేలు తెచ్చాడు, ఇంకో లక్ష ఇస్తే అందరం సంతోషిస్తాం అని పేర్కొన్నారు. ఆపై జానాకు ధన్యవాదాలు చెబుతూ ఈ పదివేలనే పది కోట్లు అనుకుంటామని, నాగార్జునసాగర్ లో జానారెడ్డి తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు.













