బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ టార్గెట్ గా ఐటీ రైడ్స్..! బీజేపీ స్కెచ్చేనా..?
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడ్డాయి. అన్ని ప్రధాన పార్టీలు విజయం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈసారి టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ను ఓడించి తీరుతామని బీజేపీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ లీడర్లు ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కాస్త డల్ అయింది. కానీ ఇప్పుడు మళ్లీ జోరు పెంచేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని బలమైన నేతలను తమవైపు తిప్పుకోవాలనుకుంటోంది బీజేపీ. ఇందుకోసం తమ ముందున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విపక్షాలను రాజ్యాంగబద్ద సంస్థల ద్వారా టార్గెట్ చేస్తోందనే విమర్శలు ఎంతోకాలం నుంచి ఉన్నాయి. అది నిజమే అనిపించేలా బీజేపీ నేతలపై మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలపైనా ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి. దీంతో ఆయా సంస్థలను బీజేపీ ప్రభుత్వం మిస్ యూజ్ చేస్తోందనే విమర్శలున్నాయి. అయితే బీజేపీ మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. బహుశా ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోందని చెప్తారేమో.. ఎందుకంటే అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఇవాళ తెల్లవారగానే తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. బీఆర్ఎస్ కు చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ ఆధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. తీర్థ గ్రూప్ పేరుతో పైళ్ల శేఖర్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్, సోలార్ పవర్, బ్యాటరీ రంగాల్లో ఆయన వ్యాపారాలున్నాయి. ఇండియాతో పాటు సౌతాఫ్రికాలో కూడా శేఖర్ రెడ్డికి కంపెనీలున్నాయి. ఇక మర్రి జనార్ధన్ రెడ్డి జేసీ బ్రదర్స్ పేరుతో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఈ ముగ్గురి నివాసాలు, కార్యాలయాల్లో దాదాపు 30కి పైగా బృందాలు సోదాలు చేస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెట్ గా బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని కారు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముంగిట ఇలాంటి జిమ్మిక్కులతో లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని.. పక్కనున్న తమిళనాడులో కూడా మంత్రిపై దాడులు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. మొత్తంగా మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస నేతలు టార్గెట్ గా ఐటీ శాఖ నిర్వహిస్తున్న సోదాలు కలకలం రేపుతున్నాయి. త్వరలో మరికొందరిపైనా దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.













