ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ పెట్టమంటున్నారు
టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణని ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. భవిష్యత్తులో మండలానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్షా 116 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా ముందుకెళ్తున్నామని అన్నారు. కులవృత్తుల కోసం రూ. వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. సమైక్య పాలనలో పాలమూరు జిల్లా చాలా నష్టపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోనే విద్యుత్ సమస్యను అధిగమించామని, నాలుగున్నరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కష్టపడి సాగునీరు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ నేతల వల్లే పాలమూరుకు ఈ దౌర్భాగ్య స్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ నేతలే పాలమూరుకు అన్యాయం చేస్తున్నారని, పాలమూరు అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు దొంగ నాటకాలు కట్టిపెట్టాలని అన్నారు.













