డిసెంబర్ 7 నుండి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026
తెలంగాణలో పారిశ్రామిక విప్లవానికి, భారీ పెట్టుబడుల ఆకర్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 7 నుండి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానుంది. ‘మీ పెట్టుబడులకు మాది భరోసా’ అనే ప్రధాన ఇతివృత్తంతో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2.0’ సన్నద్ధమవుతోంది. డిసెంబరు 7-9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సమిట్‌కు ‘ప్లెడ్జ్ టు ప్లాట్ టు ప్లాంట్ టు పే రోల్ టు ప్రొడక్ట’ అనే మార్గదర్శక థీమ్‌ను ఖరారు చేశారు.
పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి హామీ ఇవ్వడం నుంచి భూమి, పరిశ్రమ ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, ఉత్పత్తి మార్కెట్‌కు చేరే వరకు సాగించే ప్రయాణాన్ని ఈ థీమ్ ప్రతిబింబిస్తుంది. మొత్తం కార్యక్రమాన్ని నాలుగు హాళ్లలో నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్‌లో వేయి హోటల్ గదులను వినియోగించనున్నారు.
ఈవెంట్ నిర్వహణకు రూ.150 కోట్ల అంచనాతో టెండర్ ప్రక్రియ చేపట్టారు. బహిరంగ ప్రాంగణ పనులను నవంబరు 15లోగా, ఇండోర్ ఏర్పాట్లను, స్కిల్స్ వర్సిటీలో ఏర్పాట్లను నవంబరు 30 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. సమిట్‌లో భాగంగా పది రంగాలకు చెందిన 25 ప్రముఖ కంపెనీలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది సమిట్ సహా ద్వైపాక్షిక, అంతర్జాతీయ పర్యటనల్లో కుదిరిన ఎంవోయూలపై సమగ్ర జాబితాను సిద్ధం చేశారు. గత సమిట్‌లో కుదిరిన 75 అవగాహన ఒప్పందాల్లో(ఎంవోయూలు) ఇప్పటివరకు 22 అమలయ్యాయి. మరో 19 ఒప్పందాలు భూముల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నాయి. నాలుగు ఒప్పందాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అవసరమవుతుండగా.. 16 సంస్థల నుంచి స్పందన రావాల్సి ఉంది. తొమ్మిది ఒప్పందాలను నిలిపివేశారు. మరో ఐదు ఒప్పందాల వివరాలను సరిచూడాల్సి ఉంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కల్పిస్తున్న ప్రోత్సాహం.. ఇప్పుడు రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతోంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 240 అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌కు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా, యువతకు అత్యధిక వేతనాలు లభించే ఉద్యోగాలను సృష్టించే ప్రధాన సాధనంగా చూస్తోంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్.., దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జీసీసీ మార్కెట్లలో అగ్రగామిగా నిలుస్తోంది. అనరాక్ ఫిక్కీ, జ్ఫెనో, యునార్త్ ఐక్యూ వంటి ప్రముఖ సంస్థల నివేదికల ప్రకారం.. దేశంలో ఏర్పాటవుతున్న మొత్తం జీసీసీలలో సుమారు 40 శాతానికి పైగా వాటా హైదరాబాద్‌కే దక్కుతుండటం విశేషం. కెనడియన్ బ్యాంకింగ్ దిగ్గజం సీఐబీసీతో పాటు డోర్‌డాష్, బిల్ట్రస్ట్, మెర్క్ షార్ప్ అండ్ డోమ్, రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ వంటి దిగ్గజ కంపెనీలు నగరంలో తమ కేంద్రాలను ప్రారంభించడం ఇందుకు నిదర్శనం. రాజకీయంగా విపక్షాల విమర్శలను తిప్పకొట్టడంలోనూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలోనూ ఈ గ్లోబల్ సమ్మిట్ అధికార పార్టీకి అత్యంత కీలకం కానుంది. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ కొనసాగింపుగా వస్తున్న ఈ సమ్మిట్ ద్వారా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని విధానాలు, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు పారిశ్రామిక వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
గతంలో జరిగిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గవర్నింగ్ కౌన్సిల’ తొలి సమావేశం ఈ సమ్మిట్ విజయవంతంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, అంతర్-విభాగ సమన్వయాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జపాన్, పశ్చిమ ఆసియా దేశాలకు చెందిన పలు కంపెనీలు తమ భారతీయ కార్యకలాపాల విస్తరణ కోసం హైదరాబాద్ వైపు చూస్తుండటం, బలమైన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వ్యవస్థ నగరానికి అదనపు బలంగా మారుతుండటం శుభపరిణామం.
చారిత్రక వేదికగా…
‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ కేవలం వ్యాపార సదస్సు మాత్రమే కాకుండా… తెలంగాణ రాజకీయ, ఆర్థిక పటాన్ని మార్చేసే చారిత్రక వేదికగా నిలవనుందడంలో ఎలాంటి సందేహం లేదు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తోంది.
సదస్సుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసే ప్రక్రియలో సహకరించాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ‘సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా మేధావులు, వ్యాపారవేత్తలు, విధాన రూపకర్తలు, ప్రవాస భారతీయులు, విద్యావేత్తలను ఆహ్వానిస్తు న్నాం. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, కృత్రిమ మేధ-సాంకేతికత, వాతావరణ పరిరక్షణ, లింగ సమాన త్వం, శాంతి తదితర అంశాలపై కీలక చర్చలుంటా యి. ప్రపంచ దేశాలతో రాష్ట్రానికి ఆర్థిక, విధాన పర మైన సంబంధాలు బలోపేతమయ్యేందుకు ఈ సద స్సు దోహదపడుతుంది’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక స్థానం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కళలు, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ జానపద కళలు, శాస్త్రీయ నృత్యాలు, ఫ్యాషన్, హస్తకళలు, బతుకమ్మకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ప్రముఖులకు ఆహ్వానాలు
ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సమిట్‌కు అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా, డాక్టర్ రెడ్డీస్, ఫైజర్, నోవార్టిస్, టెస్లా, సఫ్రాన్, అదానీ, ఐటీసీ, అమరరాజా వంటి ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలని నిర్ణయించారు. మొత్తం 220 మంది ప్రతిపాదిత సలహా మండలి సభ్యుల్లో 110 మంది ఇప్పటి వరకూ అంగీకారం తెలిపారు. పది రంగాలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపగా.. ఇప్పటి వరకూ 275 మందికిపైగా పాల్గొనేందుకు అంగీకరించారు.
ప్రముఖ నగరాల్లో రోడ్‌షోలు
దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలోనూ రోడ్‌షోలు చేపట్టాలని నిర్ణయించారు. ఆస్ట్రేలియా, దుబాయ్, మధ్యప్రాచ్య దేశాలు, అమెరికాలో అక్టోబరు 25 వరకు రోడ్‌షోలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 14న చెన్నైలో, 15న బెంగళూరులో, నవంబరులో 3న ముంబయిలో, 4న అహ్మదాబాద్‌లో రోడ్‌షోలుంటాయి. ఈ రోడ్‌షోలలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొంటారని తెలుస్తోంది. అక్టోబరు 26 నుంచి 29 మధ్య దిల్లీలోని తాజ్హోటల్లో సమిట్ కర్టెన్‌రైజర్ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.
స్పాన్సర్‌షిప్‌లతో…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట’ను ఈసారి ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా నిర్వహించేలా అధికార వర్గాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ సదస్సును పూర్తిగా కార్పొరేట్ స్పాన్సర్షిప్ ల ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల అంతర్గత సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన పలు సమ్మిట్ల తరహాలోనే ఈ సదస్సును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా దేశవిదేశాల్లో నిర్వహించ తలపెట్టిన రోడ్ షోలనే ప్రధాన వేదికలుగా మలుచుకోనున్నారు. విదేశీ రోడ్ షోల పర్యవేక్షణ కోసం ఇప్పటికే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయగా, మరికొంత మందిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. ఏయే ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించాలి, అక్కడి నుంచి స్పాన్సర్షిప్ లను ఎలా రాబట్టాలనే అంశంపై ఈ కమిటీ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది. సదస్సుకు హాజరయ్యే దిగ్గజ కంపెనీలు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో, అలాంటి సంస్థలను ముందుగా గుర్తించి, ప్రత్యేకంగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. మరోవైపు, గతేడాది డిసెంబర్లో నిర్వహించిన సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడుల కంటే ఈసారి మరికొంత ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యూహాలను అమలు చేస్తోంది. రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాల విషయంలో ప్రత్యేక వెసులుబాట్లు, సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పది రంగాలకు చెందిన 25 ప్రముఖ కంపెనీలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం హైదరాబాద్‌లో 1,000 హోటల్ గదులను కేటాయించారు.
గత సమిట్‌లో కుదిరిన 75 అవగాహన ఒప్పందాల్లో ఇప్పటివరకు 22 అమల్లోకి వచ్చాయి. 19 ఒప్పందాలు భూముల కేటాయింపు దశలో ఉండగా, మిగిలినవి వివిధ పరిశీలనల్లో ఉన్నాయి.
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, మెటా, అమెజాన్, టెస్లా, ఫైజర్, అదానీ, ఐటీసీ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను సమిట్‌కు ఆహ్వానిస్తున్నారు. 275 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యేందుకు ఇప్పటికే అంగీకరించారు.
గత గ్లోబల్ సమ్మిట్‌ను మించిపోయేలా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నామని, గతంలో వచ్చిన పెట్టుబడుల కన్నా ఈసారి మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించి తెలంగాణను పెట్టుబడిదారుల గమ్యస్థానం గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మక్గా నిర్వహిస్తోంది.
తెలంగాణ పెట్టుబడిదారులకు అనుకూలం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి వీలుగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత సంవత్సరం ఎంతోమంది పెట్టుబడిదారులు దేశ విదేశాల నుంచి వచ్చి తమ సంపూర్ణ మద్దతు అందించారు. ఈసారి కూడా అలాగే వివిధ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు, దేశంలో ఉన్న పెట్టుబడిదారులు ఈ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని కోరుతున్నాను.
సమన్వయంతో పనిచేయండి: భట్టి విక్రమార్క
ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. శాఖల మధ్య నిరంతరం సమన్వయం ఉండేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్టతను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.








