తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం : మంత్రి నిరంజన్ రెడ్డి
జలవనరుల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నదుల పరిరక్షణ, మేనిఫెస్టో తయారీ ప్రధాన అజెండాగా హైదరాబాద్లో జాతీయ సమ్మేళనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడేళ్లలో వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణతో జలవనరులను సంరక్షించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృష్ణా, గోదావరి నదుల్లోకి వ్యర్థాలు వెళ్లడం లేదు. ఈ విధానాలను ఆదర్శంగా తీసుకొని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా నీటి కోసమే పోరాటాలు జరిగే ప్రమాదముందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నదులను పరిరక్షించే బాధ్యతను తీసుకుంది. రికార్డు సమయంలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది 200 కిలోమీటర్ల మేర సజీవంగా ఉంది. నదుల్లోకి వ్యర్థాలు వెళ్లకుండా, భూమి కోతకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఏడేళ్ల కాలంలో 3 శాతం పచ్చదనం పెరిగింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో వలస వెళ్లిన ప్రజలతో పాటు పక్షులు కూడా పాలమూరుకు తిరిగివస్తున్నాయి. ఎంత పంట పండినా దాన్ని అవసరం ఉన్న చోట వినియోగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు దేశానికి దిక్సూచి కావాలన్నారు. ఈ తరహా కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్నారు.













