హైదరాబాద్ లో ఐకియా స్టోర్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైటెట్ సిటీ సమీపంలో దేశంలోనే మొట్టమొదటి ఐకియా షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. ఐకియా ద్వారా దాదాపు 2 వేల మందికి ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. షోరూమ్‌కు వచ్చే వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను ఐకియా ప్రకటించింది.
భారతదేశంలో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని తమ లక్ష్యంకాగా, ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల మీద రూ.4,500 కోట్లు వెచ్చించామని ఐకియా భారత సీఈవో పీటర్ బెట్జెల్ తెలిపారు. ఇందులో హైదరాబాద్ స్టోరు కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇంట్లో ఉపయోగపడే చిన్న వస్తువుల మొదలు, గది అలంకరణ సామాగ్రి, ఫర్నిచర్ ఇలా దాదాపు 7,500 వరకూ వస్తువులను ఈ స్టోరులో అందుబాటులో ఉంచామన్నారు. వంటగది, పడకగది, హాలు తదితరాల నమూనాలు కూడా చూడొచ్చని తెలిపారు. భారత ప్రజల అవసరాలను అర్థం చేసుకునేందుకు 1,000కి పైగా గృహాలను సందర్శించి సర్వే చేశామని పేర్కొన్నారు. తాము విక్రయించే వస్తువుల్లో 20 శాతం వరకూ ఇక్కడే తయారైనవే ఉంటాయనీ, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. దీనికోసం స్థానిక తయారీదారులు, సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.













