అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో .. హెచ్సీయూ విద్యార్థినికి
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థిని కందాల కీర్వాణికి అమెరికాలోని అత్యంత పురాతన, ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయంలో సీటు లభించింది. యేల్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీల్లో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా క్యూఎస్ ర్యాంకింగ్స్లో ఇది 18వ స్థానంలో ఉంది. అమెరికాలోనే అత్యంత పురాతనమైన యేల్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహించే పబ్లిక్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ప్రోగ్రామ్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. ఈ కోర్సు కోసం ప్రతీయేటా ప్రపంచం నలుమూలల నుంచి కేవలం 15 మందినే ఎంపిక చేస్తుండగా, ఈ ఏడాది కందాల కీర్వాణికి సీటు లభించడం విశేషం. ఆగస్టులో ఆమె కోర్సులో చేరబోతున్నారు. ఆమె హెచ్సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ సిస్టమ్స్ బయాలజీ మూడవ సంవత్సరం పూర్తి చేశారు.













