ఎంపీ సుజనాచౌదరి అమెరికా ప్రయాణానికి అనుమతి
కేంద్రం జారీచేసిన లుక్ఔట్ నోటీసులతో ఆగిన ఎంపీ సుజనా చౌదరి అమెరికా ప్రయాణానికి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ నెల 15 నుంచి రెండు వారాల పాటు అమెరికా వెళ్లడానికి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. తనపై ఉన్న లుక్ఔట్ నోటీసులను సవాలు చేస్తూ.. న్యూయార్క్లో తన మామా అనారోగ్యంతో ఉన్నారని, అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని సుజనా చౌదరి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ చల్లా కోదండరాం ఇంటి వద్ద విచారించారు. సీబీఐ, కేంద్రం తరపు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం.. పిటిషనర్ ఎంపీ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు వారాల పాటు అమెరికా వెళ్లడానికి అనుమతించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గడువులోగా తిరిగా రాగానే ఇమ్మిగ్రేషన్ శాఖకు, సీబీఐకి సమాచారం ఇస్తామనే హామీ ఇవ్వాలని షరతు విధించారు.













