కోర్టుల్లో షాక్ లు…
ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి న్యాయస్థానాల్లో వరుసగా షాకులు తగులుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ట్యాంపరింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రితోపాటు పలువురు ఐఏఎస్ అధికారులపై కూడా కేసులు పెట్టాలని వెల్లడించింది. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
మరో కేసులో మంత్రి గంగుల కమలాకర్‌పై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి జస్టిస్ చిల్లకూరు సుమలత.. రిటైర్డ్ జిల్లా జడ్జి శైలజను నియమించారు. 2018లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కమలాకర్ ఎన్నికను పక్కన పెట్టాలని సంజయ్ హైకోర్టును కోరుతున్నారు.
మంత్రుల ఎన్నికల అఫిడవిట్ లలో కోర్టుల్లో ఆదేశాలు వస్తున్నా… ఇంకా వారిని మంత్రివర్గంలో కొనసాగించడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. అభియోగాలు ఎదుర్కోవడంతో పాటు వారి కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో వారిని తక్షణమే మంత్రివర్గం నుంచి తప్పించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లో అధికశాతం మంది ఎమ్మెల్యేలు అవినీతిపరులు, అక్రమార్కులని ఆరోపించారు.
మరోవైపు ఎన్నికల ఏడాదిలో వరుసగా షాకులు తగులుతుండడంతో అధికార బీఆర్ఎస్ లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు న్యాయస్థానాల్లో అభియోగాలు ఎదుర్కొంటుండడంతో .. ఇది ఎక్కడ రాజకీయ అంశంగా మారుతుందో అన్న టెన్షన్ కనిపిస్తోంది. అయితే ఎన్నికల్లో అభియోగాలు, కేసులునమోదైన వారికి టికెట్లు ఇచ్చే విషయంలో గులాబీ బాస్ పునరాలోచన చేసే అవకాశముందని సమాచారం.













