దుబాయ్ గ్లోబల్ పద్మశాలి సమ్మిట్
చేనేతపై జీఎస్టీని కేంద్రం వెంటనే రద్దు చేయాలని గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ డిమాండ్ చేసింది. దుబాయ్లో జరిగిన సమ్మిట్లో 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో చేనేత చరిత్రతో పాటు, కేంద్ర చేనేత వ్యతిరేక విధానాలపై చర్చించారు. అనంతరం చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని తొలగించాలని కోరుతూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యరమాద వెంకన్న ప్రవేశపెట్టిన తీర్మానాన్ని, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, దుబాయ్, ఇండియా తదితర దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవులు, తెలంగాణ పవర్లూఐమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం. కోశాధికారి దేవేందర్, ఇంజనీర్స్ విభాగం అధ్యక్షుడు రంగయ్య, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.













