బొత్స వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్
తెలంగాణ విద్యావ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో అత్యున్నత విద్యను అందిస్తోంది కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారంటూ ఆయన మండిపడ్డారు. టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కేసులో నిందితులను పట్టుకుని జైలుకు పంపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్ల బదిలీలకు రూ.లక్షకు పైగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆరోపించారు. తెలంగాణలో ఆ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఏపీపీఎస్సీ సభ్యులే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు.













