అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్న హైదరాబాద్ మేయర్
జీహెచ్ఎంసీ నూతన మేయర్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమె వైపు మొగ్గు చూపింది. సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు కేశవరావు కూతురైన విజయలక్ష్మి.. బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఈ సారి ఏకంగా మేయర్ పీఠాన్ని అధిరోహించారు. కేశవరావు కమార్తె అయిన విజయలక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం అంతా హైదారాబాద్‌లోనే సాగింది. హోలీ మేరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన విజయలక్ష్మి.. రెడ్డి మహిళా కాలేజీలో చదివారు. భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం పూర్తి చేశారు. అనంతరం సుల్తాన్ ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
విజయలక్ష్మి వివాహం బాబీ రెడ్డితో జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. దాదాపు 18 ఏళ్లపాటు అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఆమె అగ్రరాజ్యంలోనే ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు. 2007లో భారత్ తిరిగొచ్చిన విజయలక్ష్మి.. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. తొలిసారి 2016లో విజయలక్ష్మి టీఆర్ఎస్ తరపున బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి. ఈ సారి ఏకంగా మేయర్ పదవిని అలంకరించారు.













