విదేశాల్లో చిక్కుకున్న వారిని విడిపించండి
మస్కట్, ఒమన్, మలేషియా దేశాల్లో ఏజెంట్ల మోసాల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలంగాణ యువకులను స్వరాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ను ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు కోరారు. ఇండోర్‌లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివాస్‌లో పాల్గొన్న మంత్రికి ఆయన వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎందరో తెలంగాణ యువకులు ఏజెంట్ల మోసాల వల్ల ఆయా దేశాల్లో చిక్కుకున్నారని, వారిని విడిపిచేందుకు లక్షల్లో ఖర్చవుతుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఈ మేరకు విదేశాల్లో బందీలుగా ఉన్నవారిని విడిపిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కోటపాటికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.













