అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం యూఎస్ఏ ఎడ్యుకేషన్ సంస్థ
ఉచిత సేవా కేంద్రం హైదరాబాద్లో
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థుల సౌకర్యం కోసం అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేస్తున్న యూఎస్ఏ ఎడ్యుకేషన్ సంస్థ హైదరాబాద్లో ఉచిత సేవా కేంద్రాన్ని వైయాక్సిస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేయనుంది. ఎడ్యుకేషన్ యూఎస్ఏ సంస్థ ఇలాంటి కేంద్రాన్ని మన దేశంలో తొలిసారిగా హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం విశేషం. కొత్త సేవా కేంద్రాన్ని జూబ్లిహిల్స్ రోడ్ నవంబర్ 36లో 5న ప్రారంభించనుంది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం దేశం నుంచి వెళుతున్న విద్యార్థుల్లో 40 శాతానికి పైగా తెలుగువారే. ఏ అర్హతలున్న వారు ఎలాంటి విశ్వవిద్యాలయాలను ఎంచుకోవాలి? ఫీజులు ఎలా చెల్లించాలి? స్టూడెంట్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలపై అవగాహన లేక విద్యార్థులు బోగస్ సంస్థల చేతిలో తీవ్రంగా నష్టపోతున్నారు. సమయాన్ని, డబ్బును, వృథా చేసుకుంటున్నారు. విద్యార్థులకు ఆ ఇబ్బందులు తప్పించి, సరైన సలహాలు అందించేందుకు కొత్త సేవా కేంద్రం తోడ్పడుతుంది.
విద్యార్థుల కోసం హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అమెరికన్ కార్నర్ పేరుతో ఇప్పటికే ఒక కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. ఆ సేవా కేంద్రం వారంలో ఒక రోజు మాత్రమే ఉంటుంది. పైగా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఆ కేంద్రం నుంచి సేవలు పొందాల్సి ఉంటుంది. కొత్త సేవా కేంద్రం వారంలో 5 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనిచేస్తుంది. పైగా విద్యార్థులు నేరుగా ఈ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉండే నిపుణులను కలుసుకుని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.













