ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ : సీఎం కేసీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని తెలంగాణ సర్కార్ నిలబెట్టుకుంది. రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణులకు సంబంధించిన క్షౌర శాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచితంగా విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇస్తూ తక్షణం జీవో జారీ జారీ చేయాలని సీఎం పేషీ అధికారులను సీఎం ఆదేశించారు. బలహీనవర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశించడంతో బీసీ సంక్షేమ శాఖ్య ముఖ్య కార్యదర్శి బుర్రా వేంకటేశం ఈ జీవోను జారీ చేశారు. ఉచిత విద్యుత్ ఏప్రిల్ 1 నుంచే అమలులోకి రానుంది. ఈ నిర్ణయం గ్రామ స్థాయి నుంచి జీహెచ్ఎంసీ వరకు అన్ని హెయిర్ సెలూన్లకు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు అందుబాటులోకి రానుంది. కుల వృత్తిలో భాగంగా వారందరూ పలు రకాల యంత్రాలు వాడుతున్నారని, ఉచిత విద్యుత్‌తో వీరికి శారీరక శ్రమ తగ్గి, ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని సీఎం పేర్కొన్నారు.













