సికింద్రాబాద్ నుంచి నేనే పోటీచేస్తా
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీకి ఎవరు వచ్చినా ఊరుకొనేది లేదని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అంజన్ మండిపడ్డారు. ఇందిరా భవన్లో జరిగిన నగర కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ రోజు రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భవిష్యత్తులో నగర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామన్నారు. సికింద్రాబాద్ నుంచి తానే పోటీ చేస్తానని సృష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ సీటు ఇంకెవరికైనా ఇస్తామని ప్రకటించలేదు కదా అన్నారు. అజారుద్దీన్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పుకుంటున్నారన్నారు. గతంలో కూడా ఆయన దేశంలోని పలు చోట్లనుంచి పోటీచేస్తానని చెప్పుకున్న సంగతిని ఈ సందర్బంగా అంజన్ గుర్తు చేశారు. ఒకవేళ అజారుద్దీన్ హైదరాబాద్ నుంచి పోటీచేస్తే మాత్రం తప్పకుండా సహకరిస్తామన్నారు. అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తామన్నారు.













