గులాబీ కమలమా..?
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుతో పోటీ చేస్తాయా..? అవుననే అంటున్నారు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న BJP, BRS లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
“బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు…పొయ్యేది లేద” అన్నారు మల్లారెడ్డి.
అయితే మల్లారెడ్డి వ్యాఖ్యలపై బండిసంజయ్ మండిపడ్డారు .”బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోడీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి అని బండి సంజయ్ ఆరోపించారు.
అయితే ఇప్పుడు .. కాంగ్రెస్ మాత్రం తాము చెప్పింది నిజమేనని మల్లారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి రుజువైందంటోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇరుపార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకెళ్లాయని.. ఇప్పుడది పొత్తురూపంలో బయటకు కనిపించే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పొత్తుతో పోటీ చేసినా, పార్లమెంటు ఎన్నికల్లో అధిక సీట్లు తమవేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.













