మంచి జరిగితే తన ఖాతాలోకి… చెడు జరిగితే ఇతరులపై
సీఎం కేసీఆర్ మంచి జరిగితే తన ఖాతాల్లోకి, చెడు జరిగితే ఇతరులపై నెట్టివేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దూషించే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారిపోయారని విమర్శించారు. సీఎం పదే పదే ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మంచిది కాదన్నారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 14 శాతం రాష్ట్రాలకు పంచుతుందని తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించి పలు నిబంధనలు, ప్రగతి, ఇతరత్రా అంశాల ఆధారంగా కేటాయింపులు ఉంటాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలో ఒకలా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మరో విధంగా కేటాయింపులు చేస్తోందనేది అవాస్తవమన్నారు. బడ్జెట్ పేపర్లో ఎక్కువ పెట్టుకుని కేంద్రం తక్కువ ఇస్తుందని బద్నాం చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు.













