విద్యలోని పరమార్థం ఉద్యోగం కాదు, జ్ఞాన సముపార్జన – ఉపరాష్ట్రపతి
- లింగ సమానత్వం మరియు మహిళల భద్రత మీద దృష్టి పెట్టాలి
- ఉన్నత విద్య దిశగా మహిళలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది
- ప్రపంచ వ్యాప్తంగా స్వాగతిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి
- ఎ.వి. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
విద్య కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసానికి మరియు జ్ఞాన సముపార్జన కోసం అనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని ఆంధ్ర విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి శ్రీ జి.జగదీష్ రెడ్డి సహా పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
2020 నాటికి భారతదేశ ప్రజల సరాసరి వయసు కేవలం 28గా ఉడబోతోందని, అదే సమయంలో చైనా, అమెరికా 37, యూరప్ 45, జపాన్ 49గా ఉంటుందని తెలిపారు. జనాభా వృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధి ముఖచిత్రం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, నాణ్యమైన విద్య, ఉద్యోగం మరియు నైపుణ్యాభివృద్ధి ద్వారా మానవ వనరుల కల్పన సాధ్యమౌతుందన్న ఉపరాష్ట్రపతి, మానవాభివృద్ధిలో గణనీయమైన సానుకూల మార్పులు వచ్చినప్పటికీ, నిరక్షరాస్యత, ఉన్నత విద్య అందకపోవడం, లింగ వివక్ష, నాణ్యతలేని ప్రజా సేవల లాంటి సమస్యలు ఇంకా చుట్టుముడుతూనే ఉన్నాయని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవకాశాలను వినియోగించుకుంటూ భారతదేశం మరింత ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా మహిళలను ప్రోత్సహించాలన్న ఉపరాష్ట్రపతి, లింగ సమానత్వం మరియు మహిళల భద్రత మీద దృష్టి పెట్టాలని తెలిపారు. ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉన్నప్పటికీ సరైన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేరని, ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస యోజన ప్రారంభమైందని, 2016లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా 4 ఏళ్ళలో 10 మిలియన్ల మంది యువతను నిపుణులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైందనన్నారు. వివక్షలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందాలన్న ఆయన, లేవండి… మేల్కొండి.. గమ్యం చేరే వరకూ విశ్రమించకండి అనే వివేకానందుని సూక్తిని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.













