లక్ష్మణ్‌కు మరో కీలక బాధ్యత
బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌కు పార్టీ జాతీయ నాయకత్వం మరో కీలక అవకాశం కల్పించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా ఆయనను నియమించింది. దీంతో ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రం నుంచి సభ్యుడిగా తొలిసారిగా అవకాశం దక్కించుకున్న నేత అయ్యారు. పార్లమెంటరీ బోర్డుతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా కూడా లక్ష్మణ్ కొనసాగనున్నారు. విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించిన లక్ష్మణ్ పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ పార్టీ కార్యదర్శిగా కూడా పని చేశారు. కాగా, పార్లమెంటరీ బోర్డులో తనకు స్థానం దక్కడం క్రమశిక్షణ గల కార్యకర్తకు బీజేపీ జాతీయ నాయకత్వం కట్టబెట్టిన గౌరవమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తరపున లక్ష్మణ్ నియామకం జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.













