టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా(టీఎస్‍పీఎస్సీ) బి.జనార్ధన్‍రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్‍ను చైర్మన్‍గా నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఆయనతో పాటు ఏడుగురు సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. వీరికి టీఎస్‍పీఎస్సీ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కారం రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, రిటైర్డ్ ఈఎన్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ బీ లింగారెడ్డి, ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్ రావులకు సభ్యులుగా అవకాశం దక్కింది.
ఈ సందర్భంగా కొత్త చైర్మన్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల నియామకాల్లో టీఎస్‍పీఎస్సీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. నిరుద్యోగులు ఎవరూ అధైర్యం పడాల్సిన అవసరం లేదన్నారు. అందరి సమన్వయంతో ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం తనకిచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 లో ఉన్న ఖాళీలను కాలపరిమితిలో ఒక ప్రణాళిక ప్రకారం నియామకాలను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఖాళీలను కాలయాపన లేకుండా భర్తీ చేస్తామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎవరికీ అన్యాయం జరగదని, పారదర్శకంగా సెలక్షన్ ఉంటుందన్నారు. ఎవరూ మద్యవర్తులను నమ్మకూడదని తెలిలిపారు.