దిశ నిందితుల ఎన్కౌంటర్
శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యోదంతానికి పోలీసులు ముగింపు పలికారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేశారు. గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత తగులబెట్టిన చాటాన్పల్లి వంతెన వద్దే నిందితులు మృతి చెందారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటాస్థలికి తీసుకెళ్లిన క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దిశను తగులబెట్టిన స్థలంలో పోలీసులుపై దాడి చేసి.. నిందితులు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు.
దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కేసును స్వయంగా పర్యవేక్షించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించేలా.. నెల రోజుల్లోనే కేసును కొలిక్కి తెచ్చేలా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కేసులో కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం బలమైన ఆధారాల కోసం సోధిస్తున్న క్రమంలోనే నిందితులు ఎన్కౌంటర్లో హతమయ్యారు.













