రాజకీయాల్లోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ?
తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, పంపిణీదారుడు వెలమకుంచ వెంకటరమణా రెడ్డి (దిల్ రాజు) రాజకీయ రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని అన్ని రాజకీయపార్టీలతో సత్సంబంధాలున్న దిల్ రాజు వచ్చే అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సమాచారం. తెలుగు సిని పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్టు కూడా ప్రచారం జోరందుకుంది. ఇటీవల దిల్ రాజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని రాజకీయ రంగ ప్రవేశంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించుకున్నారని సమాచారం.
దిల్ రాజు తన స్వగ్రామమైన నర్సింగ్‌పల్లిలో ఆయన ఖర్చుతో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి విదితమే. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న రేవంత్ పిలుపునకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ కీలక నేత ఒకరు తెలిపారు. నిజామాబాద్ లోక్‌సభ లేదా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి దింపాలన్న యోచనలో రేవంత్ ఉన్నట్లు ఆ నేత వివరించారు.













