తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి…
ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి, నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కు.ని ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్ చేయించుకున్న వారంతా కొద్ది గంటలే ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని, ఆపరేషన్లు పూర్తి అయిన అనంతరం మహిళందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు. ఆ తర్వాత మహిళలు 26, 27 తేదీల్లో గ్యాస్ట్రో లక్షణాలపై ఫిర్యాదు చేశారన్నారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించడం, ప్రవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం జరిగిందన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న 34 మందిలో నలుగురు దురదృష్వశాత్తు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇది బాధాకరమైన విషయమన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, అలాగే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.













