టీఆర్ఎస్కు సీపీఐ షాక్
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సృష్టం చేశారు. ఈ మేరకు మగ్దూం భవన్లో చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతుపై నేతలు చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీఐ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలా? వద్దా అనే అంశంపై పార్టీలో చర్చ జరిగింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం రెండురోజుల్లో స్పందించాలని ఇది వరకే సీపీఐ డెడ్లైన్ విధించింది. డెడ్లైన్ ముగియడంతో పార్టీ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.













