ఏఐసీసీ కీలక నిర్ణయం… రాజ్యసభకు వైఎస్ షర్మిల ?
తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కీలకమైన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలపై కూడా చర్చ జరిగింది. అయితే త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పగ్గాలు ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో షర్మిలకు పీసీసీ కంటే కూడా రాజ్యసభ ఇవ్వడం ద్వారా దేశంలో ఎక్కడైనా ఆమె సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ఏఐసీసీ ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకే మార్చిలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని షర్మిలకు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు షర్మిల భర్త బ్రదర్ అనీల్ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.













