తెలంగాణలో ‘పవర్’ ఫైట్..! బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య వార్..!!
తెలంగాణలో ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. దీంతో పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ – బీజేపీ మధ్య పోరు ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీ స్పీడ్ తగ్గింది. కాంగ్రెస్ రేసులో ముందుకొచ్చింది. చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ ను ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇంతలో అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని బీఆర్ఎస్ భగ్గుమంది. రేవంత్ కామెంట్స్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కింది.
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో అగ్గి రాజేస్తున్నాయి. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలనేలా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంల సరిగ్గా మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని.. సరిగ్గా మూడు గంటలు ఇచ్చినా రైతలకు సరిపోతుందనేలా ఆయన మాట్లాడారు. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ నినాదమని.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ను తీసేసి మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తారని బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించింది. అంతేకాక ప్రజలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. తమకు మూడు పంటలకూ సరిపడా విద్యుత్ కావాలని.. 3 గంటలు సరిపోదని ప్రచారం చేపట్టింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ బలపడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆ పార్టీని టార్గెట్ గా చేసుకుని బీఆర్ఎస్ ఈ ఉద్యమం చేపడుతోందనే టాక్ నడుస్తోంది.
అయితే రేవంత్ రెడ్డి కామెంట్స్ కు బీఆర్ఎస్ తప్పుడు భాష్యం చెప్తోందని కాంగ్రెస్ నేతలు రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు. ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని.. దాని పేటెంట్ మాకు మాత్రమే దక్కుతుందని వారు చెప్తున్నారు. తాము ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని కేసీఆర్ కంటిన్యూ చేస్తున్నారని.. 24 గంటల పేరుతో దగా చేస్తున్నారని మండి పడుతున్నారు. 24 గంటలూ రైతులకు విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే తాము రాజీనామా చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. అనని మాటలను పట్టుకుని బీఆర్ఎస్ ఆందోళన చేస్తోందని.. అసలు బీఆర్ఎస్ కు ఎందుకు అంత భయమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
2004లో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ నినాదంతోనే అధికారంలోకి వచ్చింది. అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ప్రజలు ఆదరించారు. దీంతో ప్రమాణ స్వీకార వేదికపైనే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు. అదే స్కీం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరచనుంది. ప్రస్తుతం 24 గంటలూ ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదని.. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చబోతోంది. ఇలా రెండు పార్టీల మధ్య పవర్ ఫైట్ తారస్థాయికి చేరింది.













