ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ డిసెంబర్ 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో ఐదు (మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తాం. ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జనవరి 7లోపు లభ్ధిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నాం. అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తుంది. ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు. ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందన్నారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాలీలు భర్తీ చేస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతాం. రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితి విధించలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించాం. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటాం. నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తే పథకాలకు ఉపయోపగడుతుంది అని రేవంత్ తలిపారు.













