వారికి తక్షణ సాయంగా రూ.10 వేలు : సీఎం రేవంత్

ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా బాధాకరమైన సందర్భం ఇది. వరద మీ బతుకుల్లో విషాదాన్ని తెచ్చి పెట్టింది. మంత్రులు, అధికారులు నిరంతరం మీ కోసం కష్టపడుతున్నారు. మంత్రి పొంగులేటి నిద్ర లేకుండా సమీక్షిస్తున్నారు. పెద్దలతో మాట్లాడుతుంటే 60, 70 ఏళ్లలో ఇంత భారీ వర్షాన్ని ( 40 సె.మీల) చూడలేదని చెబుతున్నారు. భారీ వర్షాల వల్ల రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వందల కుటుంబాలు కష్టపోయాయి. ఆ ఇళ్లలోకి వెళ్లి చూస్తే సర్వం నీళ్లులో మునిగిపోయాయి. కష్టపడి సంపాదించి కొనుక్కున్న పప్పూ, ఉప్పూ మొదలుకొని అన్ని వస్తువులూ నీటమునగడంతో తీవ్రంగా నష్టపోయారు. వరద నీటిలో తమ పిల్లల సర్టిఫికెట్లూ నానిపోయాయంటూ కొందరు వాపోతున్నారు. సర్టిఫికెట్లు పోయినవారికి కొత్తవి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. మీ కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత మాది. ఎమ్మెల్యేలు, మంత్రులు మీ నష్టాన్ని అంచనా వేస్తారు. ధైర్యంగా ఉండండి. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఎంత నష్టపోయారో అంచనా వేస్తారు అని తెలిపారు.