జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ కన్నెర్ర

సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలో సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని స్పష్టం చేశారు. సమ్మెను విరమించి, తక్షణమే జూడాలు విధుల్లో చేరాని సూచించారు. సమ్మె పేరుతో విధుల బహిష్కరణ ఏమాత్రం సరైంది కాదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యశాఖ అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు జూడాలు చేస్తున్న సమ్మెను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారి వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జూడాలవి న్యాయపరమైన కోరికలు అయినప్పుడు, పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఎలాంటి అభ్యంతరమూ ఉండదు.వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, పరిష్కరించుకోవచ్చు. అంతేకానీ, చీటికీ మాటికీ ప్రజలను ఇబ్బంది కలిగించేలా వ్యవహరించకూడదు’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
సమయా సమయాలను చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరైన పద్ధతి కూడా కాదని, అది కూడా కరోనా లాంటి సయమంలో ఇలాంటి నిర్ణయాన్ని ప్రజలు ఏమాత్రం హర్షించరని కేసీఆర్ ఆక్షేపించారు. చాలా రాష్ట్రాల్లో జూడాలకు ఇచ్చే స్టైఫండ్ కంటే తెలంగాణలో అధికంగానే ఇస్తున్నామని పేర్కొన్నారు. జూడాల సమస్యలపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా… వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి, కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్నే అందించాలని సీఎం నిర్ణయించారు. జూడాలు, వారి కుటుంబీకులకు నిమ్స్‌లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలని ఆదేశించారు.