గవర్నర్ నరసింహన్కు వీడ్కోలు
తెలుగు రాష్ట్రాలకు దాదాపు తొమ్మిదిన్నరేళ్ల పాటు గవర్నర్గా సేవలందించిన నరసింహన్కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. బెంగళూరు వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ దంపతులకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన తన సతీమణితో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయల్దేరారు. ప్రభుత్వం తరపున నరసింహన్ వెంట ఆర్అండ్ బీ ముఖ్య కార్యదర్శి, ఏడీసీని పంపారు.
అంతకుముందు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ దంపతులు గవర్నర్ దంపతులను ఘనంగా సన్మానించారు. శాసనసభాపతి, ఉపసభాపతి, మండలి ఉపాధ్యక్షుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ గవర్నర్ సేవలను గుర్తు చేసుకున్నారు.













