ఢిల్లీలో తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ భూమిపూజ
తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమి పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు ఆ వేడుకకు హాజరయ్యారు. వేద మంత్రోచ్చరణ మధ్య భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ భవన్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని వసంత్ విహార్‌లో చేపట్టారు. సుమారు 1100 చదరపు మీటర్ల ప్రాంగణంలో తెలంగాణ భవన్‌ను నిర్మించనున్నారు. త్రీ ప్లస్ త్రీ రీతిలో భవనాన్ని కట్టనున్నారు.
ఢిల్లీలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకుంటున్న అతికొన్ని ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్ చేరుతోంది. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.













