నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు ..అసెంబ్లీలో కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో 80,039 ఉద్యోగులకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడిరచారు. మిగిలిన 11,103 పోస్టుల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీరిస్తున్నట్లు తెలిపారు. 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.
ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పెంచుతున్నట్లు కేసీఆర్ సభలో ప్రకటించారు. పదేళ్లపాటు పెంచినట్లు తెలిపారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. దివ్యాంగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. ఎక్స్సర్వీస్మెన్లకు 47 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు.













