సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం… మరోసారి పొడిగింపు
జీవో నంబర్ 58, 59 కింద జంట నగరాల్లో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నూతన సచివాలయంలో జిల్లాల మంత్రులు, నేతలు, నీటిపారుదల శాఖ, ఆర్థిక ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో క్రమబద్ధీకరణ గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంలో సమస్యలు పరిష్కరించి హక్కులతో కూడిన పట్టాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఏకకాలంలో పేదల ఇళ్ల సమస్యలు పరిష్కారం కావాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల సమస్యల పరిష్కరానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని సీఎం వెల్లడిరచారు.













