పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లుంది? : కేసీఆర్
పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడెట్లుందో ప్రజలు గమనించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల దృక్పథం, చరిత్ర చూడాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని పిలుపునిచ్చారు. రాయేదో రత్నమేదో చూసి ఓటేయాలన్నారు. మంచివాళ్లకు ఓటేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. అందుబాటులో ఎవరుంటారు? నియోజకవర్గం కోసం ఎవరు పనిచేస్తారు? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలన్నారు.
2004లో కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే నాడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2005లో తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని దిగితే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఉన్న తెలంగాణను 1956లో ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పుడు ఆకలి కేకలు తప్ప ఏమీ లేదు. ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2కే కిలో బియ్యం ఎందుకిచ్చారు? అని అన్నారు. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. అందుకే ఈసారి ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలి. మీరే వేసే ఓటు రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు.













