వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను.. అవకాశం ఇస్తే తన కుమారుడు
ఎమ్మెల్సీగా తనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలోని తన ఛాంబర్లో గుత్తా మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీలో ఉంటారన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని, వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. కేసీఆర్ సీఎంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు బీఆర్ఎస్వే. కాంగ్రెస్లో చేరుతామంటున్న ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా నేతలు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్కు 2018 ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. కాంగ్రెస్ లేని కూటమి తమ విధానమని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే పట్నాలో విపక్షాల సమావేశానికి వెళ్లలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి అన్యాయమే చేసింది. తెలుగు రాష్ట్రాల విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది అని గుత్తా వ్యాఖ్యానించారు.













