రైతులకు రుణమాఫీ చేసేవరకు ఊరుకోము.. బూర నర్సయ్య గౌడ్..

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం కోసం ఎన్నికలకు ముందు ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తామని అన్నారు. అయితే ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తెలంగాణలో రేవంత్ సర్కార్ చెప్పిన పథకాలను అమలు చేయడం రోజురోజుకి కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పలువురు వీటిపై నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రెండులక్షలు రూపాయల రుణమాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన మాజీ ఎంపీ.. భువనగిరి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్.. అసలు రైతులకు రుణమాఫీ చేస్తారా? చేయరా? అని ప్రశ్నిస్తున్నారు. గురువారం నాడు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అందించిన ఆరు గ్యారెంటీలు.. అధికారంలోకి వచ్చాక అంతరించుకుపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మాయమాటలతో రైతులను, ప్రజలను మోసం చేసిందన్నారు. అయితే రైతుల కోసం పోరాడే తమ పార్టీ రుణమాఫీ చేసేటంతవరకు ఊరుకోమని.. రైతులకు పూర్తి మద్దతు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.