తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..! ముదిరిన మాటల యుద్ధం..!!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా ట్రై చేస్తోంది. ఈసారైనా ఎలాగా పాగా వేయాలని కాంగ్రెస్ పోరాడుతోంది. బీజేపీ మాత్రం ఈసారి తమదే అధికారమని, కేసీఆర్ ను గద్దె దించడం ఖాయమని ఘంటాపథంగా చెప్తోంది. బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. దీంతో ఆ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
బీఆర్ఎస్ – కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని తెలంగాణ బీజేపీ నేతలు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ నేత ఈటల రాజేందర్ ఇదే విషయాన్ని మరోసారి చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ 25 కోట్ల రూపాయలు ఇచ్చిందని.. ఇది జగమెరిగిన సత్యమన్నారు. ఇలాంటి వాటికి ఆధారాలుంటాయా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పై ఏదైనా మాట్లాడితే ముందు సీఎం, బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారని.. ఆ రెండు పార్టీలు ఎక్కడో ఒకచోట కలుస్తాయని ఈటల చెప్పారు. ఎన్నికల ముందో.. ఆ తర్వాతో ఆ రెండు పార్టీలు కలసి పని చేయడం ఖాయమని ఈటల స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్ కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. బీఆర్ఎస్ నుంచి తమకు డబ్బు అందలేదని భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేస్తానని.. ఈటల రాజేందర్ వస్తారా.. అని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు నమ్మే భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర తడి బట్టలతో శనివారం సాయంత్రం తాను ప్రమాణం చేస్తానని.. తనపై చేసిన ఆరోపణలకు ఈటల రాజేందర్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మునుగోడులో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయీ కార్యకర్తల చందాలు, విరాళాల ద్వారా వచ్చిందేనన్నారు. బీజేపీ నేతలకు మతి తప్పిందని,, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీతో కలిసి ప్రయాణిస్తోంది బీఆర్ఎస్సేనని కాంగ్రెస్ తిప్పికొడుతోంది. నిన్నటి వరకూ బీజేపీతో అంటకాగింది కేసీఆరేనని.. ఇప్పుడు జాతీయ పార్టీ పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శిస్తోంది. ఇదంతా బీజేపీ – బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అని.. ప్రజలు మోసపోవద్దని సూచిస్తోంది. ముక్కోణపు వార్ లో మూడు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికల సమయానికి ఈ మాటల యుద్ధం మరింత ముదరడం ఖాయం.













