బీజేపీ నేతలు దీక్ష చేస్తేనే.. కరోనా వస్తుందా? : విజయశాంతి
డిసెంబర్ 31న పబ్‌లు తెరిస్తే రాని కరోనా, బీజేపీ నేతలు దీక్ష చేస్తేనే వస్తుందా? అని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. హైదరాబాద్‌లో ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తెలుస్తుందని అన్నారు. వివిధ జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూమిని అమ్మేసి బినామీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దానికి సంబంధించిన నివేదికలు పార్టీ అధిష్ఠానానికి వెళ్లాయని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆక్షేపించారు. బీజేపీ నాయకులను కరీంనగర్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రైతుబంధు ఉత్సవాలు జరిపితే కొవిడ్ రాదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సంజయ్‌తో పాటు బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.













