ఎన్నికల్లో పొత్తులు ఉండవు.. ఒంటరిగానే బరిలోకి
లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో సమాన పోరాటాలుంటాయి. అత్యదిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందకెళ్లాలి. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా ఫలితాలుంటాయి. తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలు పెట్టాలి. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలి. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.













