ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా… బీజేపీ మేనిఫెస్టో
బీజేపీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల మంచి కోరే పార్టీలు కావన్నారు. పదేళ్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వని కేసీఆర్ దాని గురించి ఎన్నికల కమిషన్కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లలో చేయని పనులు పది రోజుల్లో చేస్తానంటే ప్రజలెవరూ నమ్మరన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరనేది గమనించి ఆలోచించి ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోదీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.













