రేవంత్‌ను మాకివ్వండి… టీడీపీకి బీజేపీ ఆఫర్
తెలంగాణలో అధికారంలోకి రావాలని కమల దళం వ్యూహాలు పన్నుతోంది. 2019లో జెండా ఎగురవేయాలని కలలు కంటోంది. ఇందుకోసం కమలం వ్యూహకర్తలు తమ ప్లాన్లకు పదునుపెడుతున్నారు. అధికారంలోకి రాకపోయినా…రెండో ప్లేస్ అయినా కొట్టేయాలని కమలం వ్యూహకర్తలు ఆశ పడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీకి మాస్ మసాలా ఉన్న నాయకుడు కావాలని వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో ఉన్న నేతల వివరాలు ఆరాతీస్తున్నారు. తమ పార్టీకి పనికివచ్చే నాయకుడు ఎవరు ఉన్నారని సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ జాబితాలో తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలుగుదేశం నాయకులకు ఓ ఆఫర్ ఇచ్చారట. రేవంత్‌ను మా పార్టీకి ఇవ్వండి. మీకు 2019లో ఏం కావాలన్నా చేస్తామని చెప్పారట. ఈ విషయం ఇప్పుడు బీజేపీ, టీడీపీలో ప్రచారం జరుగుతోంది.
ఏబీవీపీ నుంచి ఎదిగిన రేవంత్‌కు బీజేపీ నేతలతో పరిచయాలు ఉన్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో స్నేహం కూడా ఉంది. దీంతో రేవంత్ కమలం వైపు చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది.మరో వైపు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కూడా పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మంతనాలు జరుపుతున్నారని సమాచారం. అయితే కేంద్రమంత్రి వర్గ విస్తరణ, గవర్నర్ల నియమాకం జరిగిన తర్వాత అమిత్‌షా తెలంగాణపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి.













